

పోలీసు ఉద్యోగాల భర్తీకి నిర్వహించే రాతపరీక్షల తేదీలను పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు వెల్లడించారు. ఎస్‌ఐ, సమాన స్థాయి పోస్టులకు నవంబర్ 29న, కానిస్టేబుల్ స్థాయి పోస్టులకు డిసెంబర్ 20న రాతపరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో 7,437 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జూలై 29న నాలుగు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఎస్‌ఐ, ఏఎస్‌ఐ స్థాయి పోస్టులు 298, కానిస్టేబుల్ స్థాయి పోస్టులు 7,139 ఉన్నాయి. వీటిలో 5,000 పోస్టులు పోలీసు శాఖకు సంబంధించినవే. గత నెల 19 నుంచి ఈ నెల 16వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించారు.
మొత్తం 4.29 లక్షల మంది అభ్యర్థులు 5,77,064 దరఖాస్తులు సమర్పించారు. ఒకే పోస్టుకు దరఖాస్తు చేసిన వారు 68.45 శాతం, రెండు పోస్టులకు దరఖాస్తు చేసిన వారు 28.88 శాతంగా ఉన్నారు. మొత్తం దరఖాస్తుల్లో బీసీ అభ్యర్థులవి 49.19 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులవి 43.60 శాతం, ఓసీ అభ్యర్థులవి 7.20 శాతం, ఇతర రాష్ట్రాల అభ్యర్థులవి 3.45 శాతంగా ఉన్నాయి. మహిళలు 1,46,220 (25.33 శాతం), పురుషులు 4,30,844 (74.66 శాతం) దరఖాస్తులు సమర్పించారు. ఆధార్ ఫేస్ అథెంటికేషన్‌ను ఇంకా 2.6 శాతం మంది పూర్తి చేయలేదని, వారికి ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఇచ్చినట్లు శ్రీనివాసరావు తెలిపారు. ఎస్‌ఐ పరీక్షలను తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహించనుండగా, కానిస్టేబుల్ పరీక్షలను పది ఉమ్మడి జిల్లా కేంద్రాలతో పాటు మరో 15 నుంచి 18 కేంద్రాల్లో నిర్వహించే అవకాశం ఉందని వివరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!