

హైదరాబాద్‌లో సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, మూడు మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్లు, పోలీసు అధికారులు, రెవెన్యూ సిబ్బంది, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులతో సమావేశమై ఉత్సవాలు ప్రశాంతంగా, ఘనంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. గణేష్ మండపాలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, శానిటేషన్, భద్రత, ట్రాఫిక్, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించాలని, భక్తులకు మొక్కలు పంపిణీ చేయడంతో పాటు చేనేత కండువాలను వినియోగించాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితిని కోరారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని గణేష్ మండపాల్లో పూజలు నిర్వహించాలని సూచించారు. కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ ఉత్సవాలు నిర్వహించాలని, ప్రజల భాగస్వామ్యంతో సామూహిక గణేష్ నిమజ్జనాలను విజయవంతం చేయాలని అన్నారు. యావత్ మంత్రి వర్గం గణేష్ ఉత్సవాల్లో పాల్గొంటుందని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!