

ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఏనుగుల సంరక్షణపై కీలక సందేశం ఇచ్చారు. ఏనుగులు కేవలం అడవుల్లో నివసించే మహోన్నత జీవులు మాత్రమే కాదని, అవి అడవులకు సంరక్షకులని, పర్యావరణ సమతౌల్యానికి ప్రతీకలని పేర్కొన్నారు. భారత సహజ అటవీ వారసత్వానికి ప్రతీకలైన ఏనుగుల ఆవాసాలను రక్షిస్తామని పునరుద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నాయకత్వంలో అమలవుతున్న ప్రాజెక్ట్ ఎలిఫెంట్.. ఏనుగుల ఆవాసాలు, కారిడార్ల పరిరక్షణతో పాటు మనుషులు, వన్యప్రాణుల మధ్య సామరస్యాన్ని పెంపొందించడంలో కీలకంగా పనిచేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కుంకీ ఏనుగుల వినియోగం, హనుమాన్ చొరవతో ఈ సంరక్షణ చర్యలను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.
అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా దేశ యువతకు పవన్‌కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. యువత ధైర్యంగా కలలు కనాలని, నిరంతరం నేర్చుకుంటూ సరైన దాని కోసం దృఢంగా నిలబడాలని పిలుపునిచ్చారు. ప్రతిభను బలంగా, ఆలోచనలను శక్తిగా మార్చుకుని మార్పు కోసం ఎదురుచూసే తరంగా కాకుండా, మార్పును సాధించే తరంగా యువత ఎదగాలని సూచించారు. జ్ఞానం, ధైర్యంతో పాటు కార్యాచరణకు సిద్ధంగా ఉన్న యువత కుటుంబం, సమాజం, దేశాన్ని సైతం మార్చగలదని పేర్కొన్నారు. ప్రతి కొత్త ఆలోచన, ఆవిష్కరణ, లక్ష్యం వైపు వేసే ప్రతి అడుగు అభివృద్ధి చెందిన భారత నిర్మాణానికి మరింత చేరువ చేస్తుందని పవన్‌కల్యాణ్ తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!