

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన నిధుల వినియోగంపై కూటమి ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. 2019-24 మధ్య ప్రధానమంత్రి ఆవాస్ యోజన-పట్టణ పథకం కింద పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ధి సంస్థల్లో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం విడుదల చేసిన సుమారు రూ.2,900 కోట్లను అప్పటి ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించిందని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న సుమారు 4 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులతో పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని నివేదిక పేర్కొంది. ఈ ఇళ్లకు కేంద్రం వాటా పూర్తయిందని, మిగిలిన నిర్మాణాలను రాష్ట్ర నిధులతోనే పూర్తి చేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపింది.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన-పట్టణ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 19.07 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 15.38 లక్షల ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు ప్రారంభించగా, 11.38 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. మరో 4 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. 2024 మే నాటికి సుమారు 3.69 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. పథకం గడువు 2024 డిసెంబరుతో ముగిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో కేంద్రం రెండుసార్లు గడువు పొడిగించింది. అయినప్పటికీ 2025 డిసెంబరు నాటికి నిర్మాణాలు ప్రారంభించని ఇళ్లకు ఇకపై కేంద్ర నిధులు ఇవ్వబోమని తాజా లేఖలో స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, కేంద్రం ఇప్పటికే PMAY-Urban 2.0ను ప్రారంభించి ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా లక్ష ఇళ్లను మంజూరు చేసింది. తొలి దశ పథకాన్ని సెప్టెంబరు వరకు మాత్రమే పొడిగించడంతో పెండింగ్ ఇళ్లను పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై మరింత పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!