

నీట్ పరీక్షల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ బాలీవుడ్ నటి ప్రీతి జింటా విద్యార్థులకు, ప్రముఖ విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతు ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా స్పందించిన ఆమె, కేంద్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థి ప్రతినిధులు మరియు సోనమ్ వాంగ్చుక్తో అర్థవంతమైన చర్చలు ప్రారంభించాలని కోరారు. దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్న ఈ పోరాటం ఎంత ముఖ్యమో, వాంగ్చుక్ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని పేర్కొంటూ ఆయన నిరాహార దీక్షను విరమించాలని విజ్ఞప్తి చేశారు.
పార్లమెంట్ సమీపంలో విద్యార్థులు నిర్వహించిన ఆందోళనల సందర్భంగా పోలీసుల చర్యలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నీట్ పరీక్షలపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర, పారదర్శక విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఉద్యమానికి సినీ పరిశ్రమ నుంచి కూడా మద్దతు లభిస్తోంది. షబానా అజ్మీ, ప్రకాశ్ రాజ్, సోనాక్షి సిన్హా, సోనూ సూద్, అదితి రావ్ హైదరీ, భూమి పెడ్నేకర్, దియా మీర్జా, వీర్ దాస్, టోవినో థామస్ తదితర ప్రముఖులు విద్యార్థులకు సంఘీభావం తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!