

ముంబైలో అక్టోబర్ 2న నిర్వహించాలనుకున్న నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ‘జైల్ భరో ఆందోళన’కు పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా శివాజీ పార్క్‌లో నిరసన చేపట్టాలని సీజేపీ నిర్ణయించగా, అక్కడ సభ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చే అధికారం తమకు లేదని ముంబై పోలీసులు తెలిపారు. బాంబే హైకోర్టు తీర్పు, అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను కారణాలుగా పేర్కొంటూ, శబ్ద కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ, ప్రజల రాకపోకలకు అంతరాయం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వివరించారు. ప్రత్యామ్నాయ ప్రాంతాన్ని ఎంచుకుని అనుమతి కోరాలని నిర్వాహకులకు సూచించారు.
అనుమతి నిరాకరణపై అభిజీత్ దీప్కే స్పందిస్తూ, పౌరుల గొంతుకను అణచివేసే చర్యలు ఆమోదయోగ్యం కాదని పేర్కొంటూ అక్టోబర్ 2న ముంబైలో ‘జైల్ భరో ఆందోళన’ నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఓటర్ల జాబితాలపై చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణను నిలిపివేయాలని, ఎన్నికల సంఘానికి సంబంధించిన చట్టపరమైన వ్యవస్థలో మార్పులు చేయాలని కూడా కోరుతోంది. ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ వచ్చిన ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందిస్తూ.. అభిప్రాయ భేదాలు సంస్థాగత చర్చల్లో సాధారణమేనని, కీలక నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నామని స్పష్టం చేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!