

పోలీసు సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం సిబ్బంది సంక్షేమంలో కీలక భాగమని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. పిల్లల చదువుపై ఆందోళన లేకుండా ఉంటే పోలీసులు తమ విధులపై మరింత దృష్టి సారించి సమర్థవంతంగా పనిచేయగలరని తెలిపారు. మణిచిరేవులలోని ఆక్టోపస్ గ్రేహౌండ్స్ ప్రాంగణంలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అకడమిక్ బ్లాక్–1 నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 2024 డిసెంబర్‌లో పోలీసు సిబ్బంది పిల్లల కోసం ఈ పాఠశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్మీ, సైనిక్ పాఠశాలల తరహాలో జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో దీనిని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. గత ఏడాది ఏప్రిల్‌లో తాత్కాలిక ప్రాంగణంలో 120 మంది విద్యార్థులతో ప్రారంభమైన పాఠశాలలో ప్రస్తుతం సుమారు 360 మంది విద్యార్థులు ఉన్నారని, కొత్త భవనం పూర్తయితే వచ్చే ఏడాది ఈ సంఖ్య 700–720కు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.
విద్యతో పాటు క్రమశిక్షణ, క్రీడలు, సహపాఠ్య కార్యక్రమాలకు పాఠశాలలో ప్రాధాన్యత ఇస్తామని డీజీపీ తెలిపారు. క్రికెట్, రాక్ క్లైంబింగ్, గుర్రపు స్వారీ వంటి క్రీడలు, సాహస కార్యక్రమాల్లో శిక్షణ అందిస్తామని చెప్పారు. విద్యార్థులు మాదకద్రవ్యాలు, ఇతర అనారోగ్యకర ప్రభావాలకు దూరంగా ఉండేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. పోలీసు సిబ్బందితో పాటు హోంగార్డుల పిల్లలకు కూడా ప్రవేశం కల్పించడంతో పాటు, సాధారణ విద్యార్థులకు 50 శాతం సీట్లు అందుబాటులో ఉంచి తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్య అందించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ సహకారంతో ప్లస్–టూ వరకు ఒకే ప్రాంగణంలో విద్య అందించే పూర్తి స్థాయి పాఠశాలగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. వచ్చే రెండు, మూడు సంవత్సరాల్లో ఉన్నత ప్రమాణాల విద్యాసంస్థగా తీర్చిదిద్దేందుకు నిర్మాణ, అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!