

అసెంబ్లీ ఆవరణలోని శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్‌లో హైదరాబాద్ మహానగరంలో గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీగణేశ్‌తో పాటు జీహెచ్ఎంసీ, సీహెచ్ఎంసీ, ఎంఎంసీ, హైడ్రా కమిషనర్లు, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర అధికారులు, గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు హాజరయ్యారు.
గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన గత సంప్రదాయాన్ని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పునరుద్ధరించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. నిర్వాహకుల సమస్యలను తెలుసుకునేందుకే తాను స్వయంగా సమీక్ష నిర్వహిస్తున్నానన్నారు. మండపాలకు అతిథులను ఆహ్వానించినప్పుడు ఆ వివరాలను స్థానిక పోలీసు కమిషనరేట్‌కు అందించాలని సూచించారు. అనుకోని పరిణామాలు ఎదురైనప్పుడు వేగంగా చర్యలు తీసుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, నిర్వాహకులు సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకుని ఈ సదుపాయాన్ని పొందాలని సూచించారు.
మండపాల ఏర్పాట్లపై ముందుగానే సమాచారం అందిస్తే పోలీసులు ట్రాఫిక్, బందోబస్తు నిర్వహణను సమర్థంగా చేపట్టగలరని సీఎం తెలిపారు. అభివృద్ధి చేస్తున్న చెరువుల్లో గణేశ్ నిమజ్జనాలకు అనుగుణంగా నిర్మాణ సమయంలోనే అవసరమైన ఏర్పాట్లు చేయాలని, క్రేన్లు ఏర్పాటు చేసేందుకు తగిన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఉత్సవాలు ముగిసే వరకు మున్సిపల్, పోలీసు శాఖలు నిరంతరం పర్యవేక్షించాలని, కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సమన్వయం కోసం ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిర్వాహకులు సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!