

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కౌశికి అమావాస్య సందర్భంగా గురువారం కోల్‌కతాలోని ప్రసిద్ధ కాళీఘాట్ ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో ఇతర భక్తులతో కలిసి కింద కూర్చుని సంప్రదాయ భోగ్‌ను స్వీకరించారు. ఇందులో చేపలు, బసంతి పులావ్ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని పలు శాక్త సంప్రదాయ ఆలయాల్లో చేపలతో కూడిన నైవేద్యాలు సంప్రదాయ ఆచారాల్లో భాగంగా కొనసాగుతున్నాయి.
దుర్గాపూజ సమయంలో బెంగాలీలు మాంసాహారానికి దూరంగా ఉండాలంటూ బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి ధీరేంద్ర కృష్ణ శాస్త్రి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ అంశం చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా సువేందు అధికారి మాట్లాడుతూ ప్రజలు తమకు నచ్చిన ఆహారాన్ని తీసుకునే స్వేచ్ఛ ఉందని స్పష్టం చేశారు. ప్రాంతీయ ఆహార సంప్రదాయాల వల్ల సనాతన సంప్రదాయాలు బలహీనపడవని అన్నారు. దుర్గాష్టమి రోజున తాను సాత్విక ఆహారాన్నే తీసుకుంటానని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!