

ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లపై అదనంగా రూ.5 ఛార్జీ విధించింది. ఈ కొత్త ఛార్జీ ఇప్పటికే వినియోగదారుల బిల్ సమ్మరీలో కనిపిస్తోంది. ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు వినియోగదారులను డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లించేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆహార ఆర్డర్లపై ప్లాట్‌ఫాం ఫీజు, రెస్టారెంట్ ప్యాకేజింగ్ ఛార్జీలు, జీఎస్‌టీ వసూలు చేస్తున్న జొమాటోకు ఈ కొత్త ఛార్జీ వినియోగదారులపై అదనపు భారంగా మారనుంది. ఆన్‌లైన్‌లో చెల్లించే వారికి ఈ ఛార్జీ వర్తించదు.
జొమాటో ఇటీవల ఒక్కో ఆర్డర్‌పై ప్లాట్‌ఫాం ఫీజును రూ.12.50 నుంచి రూ.14.90కి పెంచింది. మరోవైపు ఫుడ్ డెలివరీ రంగంలో పోటీ మరింత తీవ్రమవుతోంది. ర్యాపిడో, ఫ్లిప్‌కార్ట్ తమ ఆహార డెలివరీ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించాయి. దీంతో జొమాటో, స్విగ్గీకి పోటీ పెరుగుతోంది. లాభాలను మెరుగుపరుచుకునే ప్రయత్నాల్లో భాగంగానే జొమాటో క్యాష్ ఆన్ డెలివరీ ఛార్జీని ప్రవేశపెట్టినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!