

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ చమురు సరఫరాపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య ఘర్షణలతో పాటు హూతీ తిరుగుబాటుదారుల దాడులు కొనసాగుతున్న వేళ.. సౌదీ అరేబియాకు కీలకమైన ఈస్ట్-వెస్ట్ ఆయిల్ పైప్‌లైన్ కూడా దెబ్బతింది. దీంతో ఈ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చినట్లు సమాచారం. తూర్పు సౌదీలోని అబ్‌కైక్ చమురు శుద్ధి కేంద్రం నుంచి ఎర్ర సముద్ర తీరంలోని యాన్బు పోర్టు వరకు సుమారు 1,200 కిలోమీటర్ల మేర ఈ పైప్‌లైన్ విస్తరించింది. యాన్బు నుంచి బాబ్ ఎల్ మాండెబ్, సూయజ్ కెనాల్ మార్గాల ద్వారా ఆసియా, ఐరోపా దేశాలకు చమురు సరఫరా చేయవచ్చు. హర్మూజ్ జలసంధిలో అంతరాయాలు ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయ ఎగుమతి మార్గంగా ఉపయోగించేందుకు ఈ పైప్‌లైన్‌ను నిర్మించారు. అయితే డ్రోన్ దాడుల నేపథ్యంలో ఇది కూడా నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పైప్‌లైన్‌పై డ్రోన్ల దాడి జరిగినట్లు సౌదీ అధికారులు వెల్లడించగా.. పంపింగ్ స్టేషన్ల వద్ద మంటలు కనిపించినట్లు అమెరికా అధికారులు, ఉపగ్రహ చిత్రాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా పేర్కొంది. పైప్‌లైన్ తిరిగి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై స్పష్టత లేదు.
ఈస్ట్-వెస్ట్ ఆయిల్ పైప్‌లైన్ రోజుకు గరిష్ఠంగా 70 లక్షల బ్యారెళ్ల చమురును రవాణా చేయగలదు. ఇందులో సుమారు 50 లక్షల బ్యారెళ్లను ఎగుమతుల కోసం, మిగతా మొత్తాన్ని సౌదీలోని రిఫైనరీలకు తరలించేందుకు వినియోగిస్తారు. అయితే ఇటీవలి కాలంలో ఇది పూర్తి సామర్థ్యంతో పనిచేయకుండా రోజుకు 40-50 లక్షల బ్యారెళ్ల చమురును మాత్రమే రవాణా చేస్తోంది. అయినప్పటికీ ఈ పరిమాణం ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 4-5 శాతానికి సమానం. దీంతో ఈ మార్గంలో ఏర్పడిన అంతరాయం ప్రపంచ చమురు మార్కెట్‌లో అనిశ్చితిని మరింత పెంచే అవకాశం ఉంది. భారత్‌పైనా దీని ప్రభావం పడొచ్చు. మన దేశ చమురు దిగుమతుల్లో సౌదీ అరేబియా వాటా సుమారు 7-8 శాతంగా ఉంది. ఆగస్టులో భారత్ 3.32 లక్షల బ్యారెళ్ల సౌదీ చమురును దిగుమతి చేసుకోగా.. జులైలో 4.14 లక్షల బ్యారెళ్లను దిగుమతి చేసుకుంది. భారత్ పలు దేశాల నుంచి ముడిచమురును దిగుమతి చేసుకుంటున్నందున తక్షణ కొరత పెద్దగా ఉండకపోయినా.. ప్రత్యామ్నాయ చమురు సరఫరాల ధరలు పెరిగితే దిగుమతి వ్యయం గణనీయంగా పెరిగే ప్రమాదం ఉంది. PPAC గణాంకాల ప్రకారం ఏప్రిల్-జులై కాలంలో భారత్ ముడిచమురు దిగుమతి బిల్లు ఏడాది క్రితంతో పోలిస్తే 56 శాతానికి పైగా పెరిగి 63.4 బిలియన్ డాలర్లకు చేరింది. 2025-26లో ముడిచమురు దిగుమతుల వ్యయం సుమారు 135 బిలియన్ డాలర్లుగా నమోదైంది. చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల వద్ద కొనసాగి, దిగుమతి పరిమాణం తగ్గకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ వ్యయం 200 బిలియన్ డాలర్లను దాటే అవకాశం ఉంది. ధరలు మరింత పెరిగితే భారత్ వాణిజ్య, కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడి మరింత తీవ్రం కావచ్చు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!