

విద్యా వ్యవస్థకు పాఠశాల విద్యే పునాది అని, పిల్లలు చదువుకు దూరం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జాతీయ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె 2026 సంవత్సరానికి ఎంపికైన 82 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు పురస్కారాలు అందజేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ కీర్తిచంద్ర సాహు, కామారెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవాని, మంగళగిరి ఎయిమ్స్ అధ్యాపకుడు డాక్టర్ అరుణ్‌బాబు, విజయనగరం ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజేష్ కౌలూరి అవార్డులు అందుకున్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లోని మాయబందర్‌లో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు జెల్లి ప్రకాశ్‌రావుకు కూడా జాతీయ ఉపాధ్యాయ అవార్డు లభించింది.
రాజ్యాంగంలో పొందుపరిచిన సమాన అవకాశాల లక్ష్యాన్ని సాధించేందుకు విద్యే ప్రధాన సాధనమని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. ఉపాధ్యాయుల కృషితో ప్రాథమిక పాఠశాలల్లో డ్రాపౌట్ రేటు దాదాపు సున్నాకు చేరిందని తెలిపారు. ప్రాథమిక దశ నుంచే విద్యార్థుల మేధో, శారీరక, నైతిక వికాసంపై ఉపాధ్యాయులు దృష్టి పెట్టాలని, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమై పిల్లల్లో పెరుగుతున్న స్క్రీన్ టైమ్‌ను తగ్గించేందుకు క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలపై ఆసక్తి పెంచాలని సూచించారు. పిల్లల మొబైల్, టీవీ వినియోగంపై తల్లిదండ్రులతో చర్చించాలని, ‘శ్రమ గౌరవం’ వంటి విలువలను పెంపొందించాలని, పిల్లల్లో వచ్చే మార్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.
అవార్డు పొందిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు విద్యారంగంలో వినూత్న విధానాలతో సేవలందించారు. భవాని ఆటల ఆధారిత బోధన, డిజిటల్ సాధనాలతో ప్రీ ప్రైమరీ విద్యను అందిస్తూ తన పాఠశాలలో విద్యార్థుల నమోదు సంఖ్యను 40 నుంచి 130కి పెంచారు. ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ కీర్తిచంద్ర సాహు పరిశోధన, బోధన, విద్యా నాయకత్వంలో విశేష కృషి చేశారు. డాక్టర్ అరుణ్‌బాబు పీడియాట్రిక్స్ బోధన, పరిశోధనలో వినూత్న విధానాలను తీసుకురాగా, రాజేష్ కౌలూరి బోధనలో ఏఐ సాంకేతికతను సమర్థంగా వినియోగించారు. ఈ అవార్డులు విద్యలో సాంకేతికత, సృజనాత్మక బోధనా పద్ధతుల ప్రాధాన్యాన్ని చాటాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!