

2029లోగా మరో మూడు డీఎస్సీలను నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి గురుపూజోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. గతేడాది నిర్వహించిన మెగా డీఎస్సీలో 16 వేల ఉపాధ్యాయ పోస్టులను ఎంత పారదర్శకంగా భర్తీ చేశామో, భవిష్యత్తులోనూ అదే విధానాన్ని కొనసాగిస్తామని తెలిపారు. అలాగే దశాబ్దాలుగా జరగని యూనివర్సిటీ ఫ్యాకల్టీ నియామకాలను కూడా పారదర్శకంగా చేపట్టి, వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలను పూర్తి చేస్తామని చెప్పారు.
అంగన్‌వాడీ కేంద్రాల నుంచి పీజీ వరకు రాష్ట్ర విద్యా వ్యవస్థను దేశంలోనే కాకుండా ప్రపంచంలోనూ అత్యుత్తమంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సంస్కరణలు చేపడుతున్నామని లోకేశ్ తెలిపారు. మోడల్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థను తీసుకొచ్చామని, ‘వన్ క్లాస్-వన్ టీచర్’ విధానాన్ని 3 శాతం పాఠశాలల నుంచి 33 శాతానికి పెంచామని చెప్పారు. టీచర్ల బదిలీల చట్టంతో పాటు సిలబస్‌లో మార్పులు తీసుకొచ్చామని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు సేవల కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ‘లీప్’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని వివరించారు.
మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రులో అభివృద్ధి చేసిన లీప్ మోడల్ స్కూల్‌ను ప్రతి నియోజకవర్గంలో అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని లోకేశ్ తెలిపారు. చంద్రబాబు 16 ఏళ్ల పాలనలో 14 డీఎస్సీల ద్వారా సుమారు రెండు లక్షల మంది ఉపాధ్యాయులను నియమించారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ నిర్వహించి సుమారు 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు దాఖలైన 350కి పైగా పిటిషన్లను అధిగమించి నియామకాలను పూర్తి చేశామని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!