

నేపాల్‌లో ఆకస్మిక వరదల కారణంగా బురదలో చిక్కుకుని దాదాపు 10 రోజులుగా బయట ప్రపంచానికి దూరమైన ఇద్దరు వ్యక్తులు శనివారం సజీవంగా బయటపడ్డారు. బిదూర్ పట్టణంలోని నాలుగు అంతస్తుల భవనం నాలుగో అంతస్తులో బురదలో చిక్కుకుని అపస్మారక స్థితిలో ఉన్న 60 ఏళ్ల చంద్రిక శ్రేష్ఠను సహాయక బృందాలు రక్షించాయి. మరో ఘటనలో త్రిశూలి-1 జలవిద్యుత్ కేంద్రంలోని సొరంగంలో 225 మీటర్ల లోపల బురదలో చిక్కుకున్న చైనా కార్మికుడిని శనివారం మధ్యాహ్నం సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
త్రిశూలి జలవిద్యుత్ కేంద్రంలో చిక్కుకున్న మరో ఇద్దరిని శుక్రవారం సజీవంగా రక్షించిన విషయం తెలిసిందే. ఈ నెల 26న నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా 1,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరో 5,000 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. త్రిశూలి జలవిద్యుత్ కేంద్రంలోని సొరంగాల్లో 500 మందికి పైగా కార్మికులు ఉండి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
గుర్తుపట్టలేని స్థితిలో లభించిన 1,030 మృతదేహాల నుంచి డీఎన్‌ఏ పరీక్షల కోసం నమూనాలు సేకరించి ఖననం చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 1,260 మృతదేహాల నుంచి నమూనాలు సేకరించగా, 1,012 మంది బాధితుల కుటుంబ సభ్యుల నుంచి కూడా డీఎన్‌ఏ నమూనాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా, వరంగల్ జిల్లా మామునూర్‌కు చెందిన రేగూరి వినయ్ రెడ్డి ఈశా ఫౌండేషన్ తరఫున మానస సరోవర యాత్రకు వెళ్లి వరదల్లో గల్లంతయ్యారు. కెనడాలో స్థిరపడిన ఐటీ ఉద్యోగి వినయ్ ఆచూకీ ఇంకా లభించలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!