

2026–27 విద్యా సంవత్సరం నుంచి 9వ తరగతి విద్యార్థులకు మూడో భాషను తప్పనిసరి చేస్తూ సీబీఎస్‌ఈ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. సీనియర్ న్యాయవాదులు గోపాల్ శంకరనారాయణన్, ఆనంద్ గ్రోవర్.. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొన్నందున ఈ అంశాన్ని మరింత వాయిదా వేయకుండా వచ్చే వారంలోనే విచారించాలని కోర్టును కోరారు. దీనిపై సీబీఎస్‌ఈ అధికారులతో సంప్రదించి కోర్టుకు సమాధానం ఇస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.
ఇప్పటికే ప్రస్తుత విధానం ప్రకారం తదుపరి తరగతులకు ప్రమోట్ అయిన కొంతమంది విద్యార్థులకు మినహాయింపు లేదా సడలింపు కల్పించే అంశాన్ని కూడా పరిశీలించాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని కోరింది. కొత్తగా దాఖలైన పిటిషన్‌పై నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. 2026–27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న మూడు భాషల విధానంపై కోర్టు నిర్ణయం కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!