

‘నందూస్ వరల్డ్’ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకురాలు నందన మంగళవారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. విదేశాల్లో ఉద్యోగాలు, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో ఆమెను పోలీసులు సుమారు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నానికి చెందిన శివక్రాంతికుమార్ తన నుంచి రూ.15 లక్షలు వసూలు చేశారని ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. లండన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న నందనను సోమవారం ఇమిగ్రేషన్ అధికారులు డిటెయిన్ చేసినట్లు సమాచారం. అనంతరం పోలీసుల నోటీసు మేరకు ఆమె తన తల్లి, న్యాయవాదులతో కలిసి స్టేషన్కు వచ్చారు.
విచారణలో డెస్టినీ కన్సల్టెన్సీలో తన పాత్ర ఏమిటి, సంస్థ యజమాని, డైరెక్టర్లు ఎవరు వంటి అంశాలపై పోలీసులు ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. కన్సల్టెన్సీ వ్యవహారాలను తన భర్త మధుకర్, అకౌంటెంట్ చూసుకుంటారని, తనకు వాటితో ఎలాంటి సంబంధం లేదని నందన చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన కొందరు బాధితులు సైతం తాము డబ్బులు చెల్లించి మోసపోయామని ఆరోపిస్తూ ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు నందన పోలీస్ స్టేషన్కు వచ్చిన సమయంలో విలేకర్లు, ఆమె న్యాయవాదుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. అనంతరం న్యాయవాదులు క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ నెల 16న మళ్లీ విచారణకు హాజరుకావాలని పోలీసులు నందనకు నోటీసులు జారీ చేశారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!