

సోమాలియా తీరంలో కామెరూన్ జెండాతో ప్రయాణిస్తున్న ‘లుటుఫ్’ అనే కార్గో నౌకను సముద్రపు దొంగలు హైజాక్ చేసినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. తుర్కియే నుంచి మొగడిషూలోని సైనిక శిక్షణా కేంద్రానికి ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలు, ఉపగ్రహ పరికరాలను తరలిస్తున్న ఈ నౌకలో మొత్తం 10 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో ఆరుగురు భారతీయులు కాగా, మిగిలిన వారు తుర్కియే, జార్జియా, సెర్బియాకు చెందినవారిగా అధికారులు తెలిపారు. ఘటనపై భారత విదేశీ వ్యవహారాల శాఖ నుంచి ఇంకా అధికారిక స్పందన వెలువడలేదు. నౌక హైజాక్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
హైజాక్‌కు ముందు ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్న ఓ చిన్న పడవ నౌకను సమీపించినట్లు సమాచారం. వారు అక్కడి నుంచి తీరానికి వెళ్లిన కొద్దిసేపటికే ఆ ప్రాంతంలో వైమానిక దాడి జరిగినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఎనిమిది మంది సాయుధ సముద్రపు దొంగలు నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో చిన్న పడవలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అయితే వైమానిక దాడికి పాల్పడింది ఎవరు, మృతులకు నౌక హైజాక్‌తో ఏమైనా సంబంధం ఉందా అనే అంశాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!