

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త వీసా నిబంధనల అమలును బోస్టన్‌లోని ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. విదేశీ విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్లు, జర్నలిస్టులు అమెరికాలో ఉండే కాలవ్యవధిపై పరిమితులు విధించేలా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం రూపొందించిన నిబంధనలను అమలు చేయకుండా కోర్టు ఆదేశించింది. నిబంధనలు అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఈ నిర్ణయం వెలువడింది. దీంతో ఈ మార్పులతో ప్రభావితమయ్యే వారికి తాత్కాలిక ఊరట లభించింది.
యాభై ఏళ్లకుపైగా అమలులో ఉన్న వ్యవస్థను ఒక్కసారిగా మార్చేందుకు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం పేర్కొన్న కారణాలు పూర్తిగా సమర్థించేవిగా లేవని కోర్టు అభిప్రాయపడింది. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే అమెరికా యూనివర్సిటీల్లో ప్రవేశాలు తగ్గి, ఉన్నత విద్యారంగంతో పాటు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఎఫ్-1 వీసాపై వచ్చే విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న ‘డ్యురేషన్ ఆఫ్ స్టేటస్’ విధానాన్ని తొలగించి, వారి బసకు నిర్దిష్ట కాలపరిమితి విధించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అలాగే జే-1 వీసాలపై వచ్చే ఎక్స్ఛేంజ్ విజిటర్లు, ఐ-వీసాలపై వచ్చే మీడియా ప్రతినిధులకు కూడా నిర్దిష్ట కాలపరిమితులు విధించాలని భావించింది. ఈ మార్పులతో 3 లక్షల మందికిపైగా భారతీయులు ప్రభావితమయ్యే అవకాశం ఉండటంతో కోర్టు తీర్పు వారికి తాత్కాలిక ఉపశమనం కల్పించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!