

చైనాకు చెందిన అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రపంచంలో నిబంధనలు లేని పరిస్థితి ట్రాఫిక్ సిగ్నల్స్ లేని కూడలిలా మారుతుందని వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితుల్లో గందరగోళం తప్పదని హెచ్చరించారు. దిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. సరఫరా గొలుసులను పరిరక్షించడం, సమీకృత మార్కెట్‌ను ప్రోత్సహించడం కోసం గ్లోబల్ సౌత్ దేశాలతో బ్రిక్స్ తన సన్నిహిత సంబంధాలను మరింతగా ఉపయోగించుకోవాలని సూచించారు. వాణిజ్యం, తయారీ, పెట్టుబడులు, సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఐదు సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించారు.
బలవంతుడిదే రాజ్యం అనే భావనకు స్వస్తి పలకాలని జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. గ్లోబల్ సౌత్ దేశాల ఐక్యతకు బ్రిక్స్ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని సూచించారు. దేశం పరిమాణం, శక్తిసామర్థ్యాలు, సంపదతో సంబంధం లేకుండా అంతర్జాతీయ వేదికపై అన్ని దేశాలూ సమానమేనని పేర్కొన్నారు. అంతర్జాతీయ నియమాలను అన్ని దేశాలు కలిసి రూపొందించాలని, అవి అందరికీ సమానంగా వర్తించేలా గ్లోబల్ సౌత్ దేశాలు కృషి చేయాలని అన్నారు. ప్రపంచ వ్యవహారాల్లో ఐక్యరాజ్యసమితి అధికారాన్ని, పాత్రను సమర్థిస్తూ.. అన్ని దేశాలకు సమాన భాగస్వామ్యం కల్పించాలని కోరారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!