

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో వచ్చిన ‘ఇండియన్ 2’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ‘ఇండియన్ 3’పై సందిగ్ధత నెలకొంది. సీక్వెల్ ఫలితం ప్రభావంతో మూడో భాగాన్ని పక్కన పెట్టినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మరోసారి చర్చలోకి వచ్చింది. చెన్నై వర్గాల సమాచారం ప్రకారం ‘ఇండియన్ 3’ నిర్మాణానంతర పనులను తిరిగి ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఇండియన్ 2’తో పాటే మూడో భాగానికి సంబంధించిన ఎక్కువ శాతం చిత్రీకరణ కూడా పూర్తయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొంత ప్యాచ్ వర్క్, కంప్యూటర్ గ్రాఫిక్స్ పనులు మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం. వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
‘ఇండియన్ 3’ ప్రాజెక్ట్ శంకర్‌కు కూడా ఇప్పుడు కీలకంగా మారింది. ఇటీవల ‘గేమ్ ఛేంజర్’ ఫలితంతో కొంత వెనుకబడిన ఆయనకు ఈ చిత్రం మరో అవకాశంగా నిలవనుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే సమయంలో ‘ఇండియన్’ ఫ్రాంచైజీకి ఉన్న ప్రత్యేక గుర్తింపును దృష్టిలో పెట్టుకుని మూడో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్రీకరణలో ఎక్కువ భాగం పూర్తయి ఉండటంతో, మిగిలిన పనులను పూర్తి చేయడానికి ఎక్కువ సమయం అవసరం లేకపోవచ్చని సమాచారం. అయితే సినిమా విడుదలకు సంబంధించిన తుది నిర్ణయం ఇంకా అధికారికంగా వెలువడలేదు. త్వరలోనే ‘ఇండియన్ 3’పై మేకర్స్ నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉందనే వార్తలు ప్రస్తుతం ఆసక్తిని పెంచుతున్నాయి.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!