

మానవ శరీరంలో అంతర్గత వాపు అనేక దీర్ఘకాలిక వ్యాధులకు ప్రధాన కారణంగా మారుతోంది. ఆర్థరైటిస్ ఫౌండేషన్ ప్రకారం తరచూ తీవ్రమైన అలసట, కీళ్ల నొప్పులు, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తే అది వాపు పెరుగుతోందని సూచిస్తుంది. ఆశ్చర్యకరంగా, ఆరోగ్యకరంగా భావించే గోధుమలు కూడా కొందరిలో సమస్యలను పెంచవచ్చు. మిఠాయిలు, శీతల పానీయాలు, ప్యాక్ చేసిన పండ్ల రసాల్లోని ప్రాసెస్ చేసిన చక్కెరలు శరీరంలో ‘సైటోకిన్లు’ పెంచి వాపును వేగంగా పెంచుతాయి. అలాగే పిజ్జా, చీజ్ వంటి ఆహారాల్లోని సంతృప్త కొవ్వులు, ఫ్రైడ్ స్నాక్స్‌లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ గుండె సమస్యలు, కీళ్ల నొప్పులను తీవ్రతరం చేస్తాయి.
అధికంగా ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే సోయాబీన్, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు నూనెల వినియోగం కూడా వాపును పెంచుతుంది. మైదా, తెల్ల బియ్యం వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి వాపును ప్రేరేపిస్తాయి. ఎంఎస్జీ, గ్లూటెన్, కేసిన్ పట్ల సున్నితత్వం ఉన్నవారిలో జీర్ణ సమస్యలు పెరుగుతాయి. ఆస్పర్‌టేమ్ వంటి కృత్రిమ స్వీటెనర్లు, అధిక మద్యం వినియోగం కూడా శరీరంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ఈ సమస్యలను తగ్గించుకోవాలంటే పండ్లు, ఆకుకూరలు, ఒమేగా-3 ఎక్కువగా ఉండే చేపలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!