

హైదరాబాద్ పాతబస్తీలోని లాల్‌దర్వాజా సింహవాహిని మహాంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా కొనసాగింది. ఆషాఢ బోనాల సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పార్లమెంట్ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు, కమిటీ సభ్యులు వారికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి ఎస్. నంద, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలాలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టర్ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హైదరాబాద్ బోనాలకు ప్రత్యేక గుర్తింపు ఉందని, రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లతో బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తోందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో బోనాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని, భక్తుల సౌకర్యార్థం పటిష్ట ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నెలరోజుల పాటు వివిధ కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!