

కోలీవుడ్ స్టార్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా సినీ రంగంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం ‘సిగ్మా’. యువ హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 31న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాలతో వాయిదా పడింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాసన్ సంజయ్ తన సినీ ప్రయాణం, తండ్రి విజయ్ అందించిన ప్రోత్సాహం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
చిన్నప్పటి నుంచి తన తండ్రి సినీ ప్రయాణాన్ని చూస్తూ పెరగడం వల్ల తనకు సినిమాలపై ఆసక్తి ఏర్పడిందని జాసన్ తెలిపారు. అందుకే విదేశాలకు వెళ్లి స్వతంత్రంగా ఉంటూ చిత్ర నిర్మాణంపై కోర్సు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తన ఆలోచనను తండ్రికి చెప్పగానే విజయ్ ఎలాంటి సందేహం లేకుండా వెంటనే అంగీకరించారని వెల్లడించారు. విదేశాల్లో కోర్సు చేసేందుకు మొదట అనుమతి ఇచ్చిన వ్యక్తి తన తండ్రేనని తెలిపారు. చిత్ర నిర్మాణంపై మంచి అవగాహన కోసం కోర్సు చేయాలని విజయ్ ప్రోత్సహించారని, తన నిర్ణయానికి పూర్తిగా మద్దతుగా నిలిచారని జాసన్ సంజయ్ గుర్తుచేసుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!