

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) అమలులో సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్) ప్యాకేజీ ధరలు తమకు అనుకూలంగా లేవని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల సంఘం (టెన్హా) అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి ఇప్పటికే ఆరోగ్య పథకం కోసం చందాలు వసూలు చేసినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలు అందుబాటులో ఉండటంపై స్పష్టత రావడం లేదు.
ఈహెచ్ఎస్ కోసం 886 ఆస్పత్రులు నెట్‌వర్క్‌లో ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే ఆస్పత్రులు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, పాత ఉద్యోగుల ఆరోగ్య పథకం ధరలతో పోలిస్తే కొత్త సీజీహెచ్ఎస్ ధరలు తక్కువగా ఉన్నాయని ఆస్పత్రులు పేర్కొంటున్నాయి. సంవత్సరానికి సుమారు రూ.1,080 కోట్ల నిధులు అందుబాటులో ఉన్న నేపథ్యంలో మెరుగైన ఆరోగ్య బీమా విధానాన్ని పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. వైద్య సేవల ధరలను పునఃసమీక్షించి, ఆస్పత్రుల ప్రతినిధులను నిర్ణయ ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని టెన్హా డిమాండ్ చేస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!