

జిల్లావ్యాప్తంగా విద్యార్థుల కంటి ఆరోగ్య పరిరక్షణకు భారీ స్థాయిలో కంటి పరీక్షల కార్యక్రమం ప్రారంభమైంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన సుమారు 1.90 లక్షల మంది విద్యార్థులకు కంటి స్క్రీనింగ్ నిర్వహించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఏడాది 66 వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా, 3,815 మందికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. 75 మందిని శస్త్రచికిత్సల కోసం సిఫార్సు చేశారు.
విద్యార్థులందరికీ దశలవారీగా కంటి పరీక్షలు నిర్వహించేందుకు 12 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏడు బృందాలు స్క్రీనింగ్ నిర్వహిస్తుండగా, ఆగస్టు 1 నుంచి అన్ని బృందాలు పూర్తి స్థాయిలో పనిచేయనున్నాయి. రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలల్లోని 10 నుంచి 18 ఏళ్ల వయసున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. అవసరమైన వారికి కళ్లజోళ్లు, వైద్య చికిత్సలు అందించనున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!