

త్వరలో విడుదల కానున్న రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్ చిత్రాన్ని ఆన్‌లైన్ పైరసీ నుంచి కాపాడేందుకు బాంబే హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది. ఓ ప్రైవేట్ స్క్రీనింగ్ సందర్భంగా సినిమా ట్రైలర్‌లోని కొన్ని భాగాలను రహస్యంగా రికార్డ్ చేసి ఆన్‌లైన్‌లో లీక్ చేయడంతో చిత్ర నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. థియేటర్లలో విడుదలైన తర్వాత కూడా సినిమా పైరసీకి గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ అత్యవసర న్యాయ రక్షణ కోరారు. దీనిపై స్పందించిన కోర్టు, అనధికారిక వీడియో క్లిప్స్, ఆడియో, సినిమా పూర్తి కాపీలను బ్లాక్ చేసి తొలగించాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది. గూగుల్ సహా పలు టెక్నాలజీ సంస్థలు ఈ ఆదేశాలను పాటించేందుకు అంగీకరించాయి. పైరసీ లింకులను అప్‌లోడ్ చేసినా, షేర్ చేసినా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
పైరసీ వెబ్‌సైట్లు కొత్త లింకులు, డొమైన్ల ద్వారా ఆంక్షలను తప్పించుకోకుండా కోర్టు డైనమిక్ ఇంజక్షన్‌ను కూడా జారీ చేసింది. దీని ప్రకారం కొత్తగా గుర్తించే వెబ్‌సైట్లు, లింకులను కూడా ఇదే ఆదేశాల పరిధిలో బ్లాక్ చేయవచ్చు. ప్రతిసారీ కొత్త లింక్ కనిపించినప్పుడు నిర్మాతలు మళ్లీ కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు. ఈ రక్షణ డిసెంబర్ మధ్య వరకు అమల్లో ఉండనుంది. ఆ సమయంలో కోర్టు కేసును మరోసారి సమీక్షించనుంది. సుమారు రూ.2,000 కోట్ల బడ్జెట్‌తో రామాయణ మొదటి భాగాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందులో రణబీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు. ప్రేక్షకులు అక్రమ ఆన్‌లైన్ లింకుల ద్వారా కాకుండా థియేటర్లలోనే సినిమాను వీక్షించేలా చూడాలని చిత్ర బృందం భావిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!