

టాలీవుడ్‌లో తండ్రి పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సీనియర్ నటుడు మురళీ శర్మ తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం మహాకాళి, ఆపరేషన్ ట్రాల్, కాకా వంటి పలు భారీ ప్రాజెక్టుల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రయాణంతో పాటు ఇండస్ట్రీలో వస్తున్న మార్పుల గురించి ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం సినిమాల్లో కథలను రాసే విధానంలో నాణ్యత గణనీయంగా పెరిగిందని, ఒక సినిమా విజయానికి బలమైన కథే ప్రధాన బలమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇప్పటివరకు 250కిపైగా సినిమాల్లో నటించానంటే తనకే నమ్మశక్యంగా లేదని మురళీ శర్మ తెలిపారు. కెరీర్ ప్రారంభంలో ఇంత దూరం వస్తానని ఊహించలేదని, అంత పెద్ద కల కనే ధైర్యం కూడా చేయలేదని చెప్పారు. అయినప్పటికీ తన కళ ఇంకా పూర్తిగా నెరవేరలేదనే భావన ఉందన్నారు. సినిమాలో తన పాత్ర నిడివి ఎంత అనేది తాను ఎప్పుడూ పట్టించుకోలేదని, వైవిధ్యభరితమైన పాత్రలు చేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. దర్శకులు ఎలాంటి పాత్ర ఇచ్చినా దానికి వంద శాతం న్యాయం చేయడమే తన బాధ్యతగా భావిస్తానని మురళీ శర్మ స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!