

తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్ వ్యవస్థ ప్రస్తుతం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. స్టార్ హీరోల సినిమాలు విడుదల కావడానికి ఎక్కువ సమయం పడుతుండటమే ఇందుకు ప్రధాన కారణమని పలువురు నిర్మాతలు, సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఏడాదికి ఒకటి లేదా రెండు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన అగ్ర హీరోలు ఇప్పుడు ఒక్కో సినిమాకు రెండేళ్లు, మూడేళ్లు సమయం తీసుకుంటున్నారు. దీంతో నిర్మాణ వ్యయం, వడ్డీ భారం పెరగడంతో పాటు థియేటర్లకు క్రమం తప్పకుండా కంటెంట్ అందడం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది.
తెలుగు బాక్సాఫీస్‌పై ప్రభావం చూపగల అగ్ర హీరోల సినిమాల మధ్య గ్యాప్ కూడా పెరుగుతోంది. ప్రభాస్ ‘ది రాజాసాబ్’ తర్వాత ‘ఫౌజీ’తో రానుండగా, రామ్‌చరణ్ తదుపరి చిత్రం విడుదలపై ఇంకా స్పష్టత లేదు. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ తర్వాత ‘రాకా’ను 2027లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మహేశ్‌బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’తో 2027లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని ‘డ్రాగన్’తో 2027లో రానున్నారు. స్టార్ సినిమాల కొరతతో ప్రేక్షకుల థియేటర్ రాక తగ్గడం, ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లపై ప్రభావం చూపుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!