

హైదరాబాద్‌లో జరిగిన 30వ ఫిల్మ్ ఎనలిటికల్ అండ్ అప్రిసియేషన్ సొసైటీ (ఫాస్) పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ నటుడు మురళీమోహన్ ఎన్టీఆర్ సెంటినరీ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రతిభను గుర్తించి అందించే పురస్కారాలు కళాకారులు, సాంకేతిక నిపుణులకు ఎంతో విలువైనవని ఆయన అన్నారు. అవి మరింతగా శ్రమించేందుకు ప్రోత్సాహాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. మూడు దశాబ్దాలుగా సినీ కళాకారులను ప్రోత్సహిస్తూ పురస్కారాలు అందిస్తున్న ఫాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.ధర్మారావును మురళీమోహన్ అభినందించారు. ఇదే వేదికపై హేమలత పురస్కారాన్ని అందుకున్న సీనియర్ నటి అన్నపూర్ణతో కలిసి గతంలో నాటకాల్లో నటించిన జ్ఞాపకాలను కూడా ఆయన గుర్తుచేసుకున్నారు.
దాసరి నట, రాజకీయ పురస్కారాన్ని అందుకున్న బాబుమోహన్.. మంత్రి పదవిలో ఉన్న కాలాన్ని మినహాయిస్తే 42 ఏళ్లుగా నటుడిగా కొనసాగుతున్నానని తెలిపారు. ప్రస్తుతం కూడా పలు సినిమాల్లో నటిస్తున్నానని, తన సినీ ప్రయాణం ఎంతో సంతృప్తిని ఇస్తోందని చెప్పారు. ‘మా’ ఉపాధ్యక్షుడు మాదాల రవి ఫాస్ సంస్థ చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ, ఎలాంటి స్వార్థం లేకుండా సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తున్న ధర్మారావును అభినందించారు. ఈ వేడుకలో అక్కినేని సెంటినరీ పురస్కారాన్ని శ్రీకాంత్, టి.ఎల్.కాంతారావు పురస్కారాన్ని నరసింహరాజు, హేమలత పురస్కారాన్ని అన్నపూర్ణ, గీతాంజలి పురస్కారాన్ని హేమ, పండరీబాయి పురస్కారాన్ని రజిత, ప్రత్యేక ప్రశంసా పురస్కారాన్ని సత్యకృష్ణన్, రాజబాబు పురస్కారాన్ని అనంత్‌బాబు, జూనియర్ వేణుమాధవ్ అవార్డును రచ్చ రవి, పద్మనాభం పురస్కారాన్ని గౌతంరాజు, జీవన సాఫల్య పురస్కారాన్ని సీనియర్ పాత్రికేయుడు వినాయకరావు అందుకున్నారు. ఉత్తమ సినీ టీవీ పురస్కారం ఈటీవీకి దక్కింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!