

కన్నడ స్టార్ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ‘కాంతార’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు. కర్ణాటక తీరప్రాంత సంప్రదాయాలు, జానపద సంస్కృతిని భావోద్వేగాలతో మిళితం చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల విడుదలైన ‘కాంతార: చాప్టర్ 1’ కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలో జరగనున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (ఐఎఫ్‌ఎఫ్ఎమ్) 2026లో ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ‘లీడర్‌షిప్ ఇన్ సినిమా’ అవార్డును అందజేయనున్నారు.
ఈ అవార్డు తనకు ఎంతో గౌరవంగా భావిస్తున్నానని రిషబ్ శెట్టి తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడం తనకు ఎంతో ఆనందమని చెప్పారు. మన మూలాలకు సంబంధించిన కథలు ప్రపంచ ప్రేక్షకులకు చేరడం గర్వకారణమన్నారు. ఇక ఆయన ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘జై హనుమాన్’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!