

నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణం’లో శూర్పణఖ పాత్రను పోషిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ తన పాత్ర ఎంపిక వెనుక ఉన్న కారణాన్ని వెల్లడించింది. సాధారణంగా శూర్పణఖను ఒకే సంఘటనతో గుర్తు చేసుకుంటారని, కానీ ఆమె పాత్రలో అంతకంటే ఎక్కువ భావోద్వేగం, లోతు, సంక్లిష్టత ఉన్నాయని పేర్కొంది. అలాంటి బహుముఖ పాత్రలు నటిగా తనను ఎప్పుడూ ఆకర్షిస్తాయని రకుల్ తెలిపింది.
ఇటీవల ఓ అభిమాని రాసిన బహిరంగ లేఖకు ‘ఎక్స్’ వేదికగా స్పందించిన రకుల్, శూర్పణఖ పాత్రలోని సంక్లిష్టతే తనను ఈ పాత్రకు దగ్గర చేసిందని చెప్పింది. చరిత్ర ఆమెను ఒక కోణంలో మాత్రమే గుర్తుంచుకుందని, కానీ ఆమె కథలో ఇంకా ఎన్నో అన్వేషించాల్సిన కోణాలు ఉన్నాయని పేర్కొంది. ప్రేక్షకుల అభిప్రాయాలను సవాలు చేసే పాత్రల్లో నటించడం తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని తెలిపిన రకుల్, ‘రామాయణం: పార్ట్–1’ విడుదల తర్వాత శూర్పణఖ పాత్రను ప్రేక్షకులు కొత్త దృక్కోణంలో అర్థం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేసింది. నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్‌ఈజీ, యశ్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!