

‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ సినిమా కాపీరైట్ వివాదంలో నిర్మాత దిల్‌రాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్ ట్రయల్ కోర్టులో కొనసాగుతున్న విచారణపై గత ఏడాది ఫిబ్రవరిలో విధించిన స్టేను ఎత్తివేయాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి, జస్టిస్ వి.మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2010 ఆగస్టులో సాహితీ పబ్లిషర్స్ ప్రచురించిన ‘నా మనసు కోరింది నిన్నే’ నవలను కాపీ చేసి ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ చిత్రాన్ని తెరకెక్కించారని రచయిత్రి ముమ్మిడి శ్యామలరాణి 2017 జూలై 12న ఫిర్యాదు చేశారు. దీనిపై ట్రయల్ కోర్టు 2018 అక్టోబర్ 27న ఐపీసీ సెక్షన్ 420, కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63 కింద నోటీసులు జారీ చేసింది.
ఈ నోటీసులను సవాల్ చేస్తూ దిల్‌రాజు హైకోర్టును ఆశ్రయించగా, ఆయనపై ఐపీసీ సెక్షన్ 420 కింద నమోదైన ఫిర్యాదును కొట్టివేసింది. అయితే కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63 కింద విచారణ కొనసాగించేందుకు ట్రయల్ కోర్టుకు అనుమతిస్తూ 2024 డిసెంబర్‌లో ఉత్తర్వులు ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ దిల్‌రాజు 2025 ఫిబ్రవరి 6న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనంతరం ఫిబ్రవరి 24న సుప్రీంకోర్టు ధర్మాసనం ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించింది. ఈ స్టేను ఎత్తివేసి విచారణ కొనసాగించేందుకు అనుమతించాలని శ్యామలరాణి తరఫు న్యాయవాది బుధవారం కోరారు. అయితే సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే స్టే విధించామని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!