

‘పెద్ది’ సినిమా ప్రదర్శన సందర్భంగా టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. కోర్టు ముందు ధరలు పెంచబోమని హామీ ఇస్తూనే, కొత్త సినిమాలు విడుదలైనప్పుడల్లా ప్రత్యేక అనుమతులు మంజూరు చేయడాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. 2021లో జారీ చేసిన జీఓ నెం.120 ప్రకారం థియేటర్ల వర్గీకరణ ఆధారంగా టికెట్ ధరలను నిర్ణయించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని కోర్టు గుర్తుచేసింది. ఆ ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రత్యేక మెమోలు జారీ చేయడంపై వివరణ కోరింది.
హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ డి. చంద్రబాబు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. ప్రతి పిటిషన్ విచారణ సమయంలో ఇకపై ధరలు పెంచబోమని ప్రభుత్వం చెబుతోందని, అయితే కొత్త సినిమాల విడుదల సమయంలో మళ్లీ అనుమతులు ఇస్తోందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కోర్టు ఉత్తర్వుల అమలుపై ప్రభుత్వ వైఖరిపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!