

నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘దసరా’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ చిత్రంలో కాయదు లోహర్, సోనాలి కులకర్ణి, లెజెండరీ నటుడు మోహన్ బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
విడుదల తేదీ దగ్గరపడుతున్నా ఇప్పటివరకు ట్రైలర్ విడుదల కాకపోవడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నాని కీలక విషయాన్ని వెల్లడించారు. ‘ది ప్యారడైజ్’ సినిమాకు అసలు ట్రైలర్ ఉండదని స్పష్టం చేశారు. ప్రేక్షకులకు అత్యున్నత నాణ్యతతో కూడిన సినిమాను అందించడంపైనే తమ దృష్టి ఉందని, సమయం తక్కువగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సినిమా విడుదల తేదీ రెండుసార్లు మారడం కొంత సంకోచానికి గురిచేసిందని చెప్పిన నాని, అభిమానుల మద్దతు తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు. టీజర్ చూసి ఇది కేవలం హింసాత్మక యాక్షన్ చిత్రమేనని భావించవచ్చని, కానీ ఇందులో తల్లి కొడుకుల అనుబంధం, బలమైన భావోద్వేగాలు కూడా ప్రధానంగా ఉంటాయని తెలిపారు. అసలు కథను థియేటర్లలో చూసి ప్రేక్షకులు ఆస్వాదిస్తారని నాని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!