

కన్నడ స్టార్ యష్ ప్రధాన పాత్రలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘టాక్సిక్’పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా సినిమా కంటెంట్ గురించి నిర్మాత కే ఎల్ వెంకటనారాయణ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం ప్రతి వర్గం ప్రేక్షకుల కోసం కాకుండా పెద్దల కోసం రూపొందించబడిందని ఆయన స్పష్టం చేశారు.
చిన్నపిల్లలు, సున్నితమైన భావోద్వేగాలు కలిగిన ప్రేక్షకులు ఈ సినిమాను చూడకుండా ఉండటం మంచిదని నిర్మాత సూచించారు. ఇప్పటికే చిత్రంలో హింసాత్మక దృశ్యాలు, కొన్ని బోల్డ్ అంశాలపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో నిర్మాత చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీంతో సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో కొత్త చర్చ మొదలైంది. విడుదల తర్వాత ఈ అంశాలను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారనే ఆసక్తి కూడా పెరిగింది. రవి బసృర్ సంగీతం అందిస్తున్న ఈ భారీ చిత్రాన్ని ఆగస్టు 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. యష్ అభిమానులతో పాటు యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు కూడా ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!