

గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక స్వావలంబన కల్పించేలా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టానికి సవరణ తీసుకురావడానికి కృషి చేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్కను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వందలాది మంది సర్పంచులు ప్రజాభవన్‌లో ఘనంగా సన్మానించారు. సౌధాని భూమన్న యాదవ్, పంచాయతీరాజ్ ఛాంబర్స్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి నేతృత్వంలో సర్పంచులు మంత్రిని కలిసి గజమాలతో సత్కరించారు. పంచాయతీల సొంత ఆదాయాన్ని ట్రెజరీలో జమ చేయాల్సిన పరిస్థితి నుంచి బయటకు తీసుకువచ్చి, ఇకపై తమ సొంత ఖాతాల్లోనే జమ చేసుకునే అవకాశం కల్పించినందుకు సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.
గతంలో స్థానికంగా సమకూరిన సొంత ఆదాయాన్ని నేరుగా వినియోగించుకునే అవకాశం లేకపోవడంతో అత్యవసర గ్రామాభివృద్ధి పనులకు నిధుల కోసం ఎదురుచూడాల్సి వచ్చేదని సర్పంచులు తెలిపారు. తాజా చట్ట సవరణతో స్థానిక అవసరాలకు అనుగుణంగా నిధులను వినియోగించుకుని అభివృద్ధి పనులను వేగంగా చేపట్టే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించడం తమ ప్రభుత్వ విధానమని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన సొంత ఆదాయం గ్రామాభివృద్ధికే వినియోగపడాలని, పంచాయతీలను నిధుల కోసం ఎదురుచూసే సంస్థలుగా కాకుండా స్వయం పాలనా సంస్థలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. ఈ చట్ట సవరణకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!