

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ప్రజా సంక్షేమం, వ్యవసాయం, మౌలిక వసతులు, ఉపాధి వంటి కీలక అంశాలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. దీపం-2 పథకం కింద ఇకపై ప్రతి నాలుగు నెలలకు ఒకసారి లబ్ధిదారుల ఖాతాల్లో ఒకేసారి నగదు జమ చేయాలని నిర్ణయించారు. అలాగే ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులపై విస్తృతంగా చర్చించి, నీటి లభ్యతకు అనుగుణంగా పంటల సాగు, సీడ్‌బాల్స్‌కు సబ్సిడీ, తాగునీటి సరఫరాకు ప్రాధాన్యం వంటి అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. నేతన్న సేవలో పథకాన్ని కూడా అర్హులందరికీ వర్తింపజేయాలని స్పష్టం చేశారు.
సమావేశంలో పోలవరం ప్రాజెక్టు, నదుల అనుసంధానం, పొగాకు రైతుల సహాయం, ఉత్తరాంధ్ర అభివృద్ధి, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి అంశాలపైనా చర్చ జరిగింది. వచ్చే గోదావరి పుష్కరాల ప్రారంభ రోజునే పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలనే ప్రతిపాదనపై సానుకూలంగా చర్చించారు. పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్ర సహకారం లభిస్తుందని సీఎం తెలిపారు. భోగాపురం విమానాశ్రయం, డేటా సెంటర్లు, ఉక్కు కర్మాగారం, రైల్వే జోన్, ఐటీ పరిశ్రమలు వంటి మెగా ప్రాజెక్టులతో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేగవంతమైందని పేర్కొన్నారు. కేంద్ర పథకాల నిధుల వినియోగం, రెవెన్యూ సమస్యల పరిష్కారం, ఉద్యోగాల భర్తీపై కూడా సంబంధిత శాఖలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!