

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో మహిళా ఎమ్మెల్యేల పట్ల దురుసుగా, అనుచితంగా వ్యవహరించారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు దిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)ని ఆశ్రయించారు. ఎన్హెచ్ఆర్సీ సభ్యురాలు విజయభారతిని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ వద్ద తమకు జరిగిన ఘటన తీవ్రంగా బాధ కలిగించిందన్నారు. మహిళా ఎమ్మెల్యేల జుట్టు పట్టుకుని లాగుతూ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారని ఆమె ఆరోపించారు. తమ సహచర ఎమ్మెల్యేలను రక్షించేందుకు కొందరు ప్రయత్నించగా వారిని తోసివేశారని, కిందపడిన వారిపై కూడా దురుసుగా వ్యవహరించారని పేర్కొన్నారు.
ఈ ఘటనలో పలువురు శాసనసభ్యులకు గాయాలయ్యాయని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డికి రక్తపోటు పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తాయని తెలిపారు. తమను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకునే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మూడు రోజులుగా కోరుతున్నా స్పందన లేదని అన్నారు. అసెంబ్లీలో తమ వాదన వినేందుకు కూడా సిద్ధంగా లేరని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేలపై దాడి జరిగిందంటూ డీజీపీ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశామని, అక్కడి నుంచి కూడా స్పందన రాలేదని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ ఆరోపణలపై అధికారికంగా సంబంధిత వర్గాల స్పందన వెలువడాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!