

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1/70 చట్టం, జీవో-3ని ఎట్టి పరిస్థితుల్లోనూ పరిరక్షించి గిరిజనుల హక్కులను కాపాడతామని స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. ఏజెన్సీ ప్రాంతాల్లో 100 శాతం ఉద్యోగాలు గిరిజనులకే దక్కాలన్నదే ప్రభుత్వ విధానమని తెలిపారు. చట్టాలు, జీవోలు పార్లమెంటు, సుప్రీంకోర్టులో నిలిచేలా అందరికీ ఆమోదయోగ్యమైన విధానాలను రూపొందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఐటీడీఏ అధికారులు వివిధ సంస్థలతో 19 ఎంవోయూలు కుదుర్చుకోగా, వీటి ద్వారా 60 వేల మంది గిరిజనులకు ప్రయోజనం చేకూరనుంది. మరో లక్షన్నర మందికి నైపుణ్య శిక్షణ అందించనున్నారు. రాష్ట్రంలోని 27.39 లక్షల మంది ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం రూ.4,764 కోట్లు ఖర్చు చేస్తోందని సీఎం తెలిపారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యవసాయం, వైద్యం, విద్య, పర్యాటకం, ఉపాధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. అరకు, లంబసింగి, పాడేరు ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడంతో పాటు అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తామని చెప్పారు. అవకాడో, కుంకుమపువ్వు, పసుపు, రబ్బరు, పైనాపిల్, తేనె, తాటిబెల్లం వంటి గిరిజన ఉత్పత్తులకు విలువ జోడించి మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తామన్నారు. రూ.250 కోట్లతో పలు ప్రాంతాల్లో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తామని, సికిల్ సెల్ ఎనీమియా నియంత్రణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఐఐటీ మద్రాస్‌తో కలిసి గిరిజన విద్యార్థులకు ఏఐ శిక్షణ ఇవ్వడంతో పాటు విశాఖలో 600 మంది విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 2,336 గిరిజన ఆవాసాలకు రహదారి అనుసంధానం, 2027 డిసెంబరు నాటికి ప్రతి ఇంటికీ కుళాయి నీరు, 64,066 మందికి పక్కా ఇళ్లు, 83,923 ఇళ్లపై సౌర విద్యుత్ ఏర్పాటు లక్ష్యాలను ప్రభుత్వం చేపట్టిందని సీఎం తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!