

ప్రభుత్వ దస్త్రాల పరిష్కారంలో కొందరు అధికారులు జాప్యం చేస్తుండటం, రెండు రోజుల కలెక్టర్ల సదస్సుకు కొందరు హెచ్‌వోడీలు గైర్హాజరు కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గైర్హాజరైన అధికారుల నుంచి సంజాయిషీ తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ను ఆదేశించారు. ఈ-ఆఫీసులో ఫైళ్ల క్లియరెన్స్‌పై ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ వివరాలు వెల్లడించగా.. గత సమావేశంతో పోలిస్తే పరిస్థితి మెరుగుపడిందని, మెజారిటీ మంత్రులు, కార్యదర్శులు సగటున రెండు రోజుల్లో ఫైళ్లను పరిష్కరిస్తున్నారని తెలిపారు. అయితే కొందరు హెచ్‌వోడీలు ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఫైళ్లు పెండింగ్‌లో ఉంచకూడదని స్పష్టం చేశారు. ఆఫ్‌లైన్‌లో దస్త్రాల నిర్వహణను పూర్తిగా తొలగించాలని, అవసరమైతే అధికారులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. సమావేశాలకు అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరై పూర్తి సన్నద్ధతతో రావాలని, నిర్లక్ష్యం కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రెవెన్యూ, పట్టణాభివృద్ధి, విద్య, నైపుణ్యాభివృద్ధి అంశాలపైనా చంద్రబాబు సమీక్షించారు. నవంబర్ 1లోగా భూ దస్త్రాలను బ్లాక్‌చైన్‌లో భద్రపరచాలని, 45 రోజుల్లో భూముల రీసర్వేను పూర్తి చేసి, రీసర్వే పూర్తయిన వివరాలను ఎప్పటికప్పుడు బ్లాక్‌చైన్‌లో నమోదు చేసి రియల్‌టైమ్ గవర్నెన్స్‌కు అనుసంధానించాలని ఆదేశించారు. వందల ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను అవినీతికి తావులేకుండా పరిష్కరించాలని, అక్రమ వసూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాల్లో కలెక్టర్లు అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను ఇతర జిల్లాల్లోనూ అమలు చేయాలని సూచించారు. ప్రతి నగరాన్ని మెరుగైన నివాస ప్రాంతంగా తీర్చిదిద్దడంతోపాటు పారిశుద్ధ్యం, స్వచ్ఛమైన గాలి, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగాలు దక్కేలా అవసరమైన నైపుణ్య శిక్షణ అందించాలని, ఐటీఐలను పరిశ్రమలతో అనుసంధానం చేయాలని సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!