

తెలంగాణ అసెంబ్లీలో విద్యపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందాల్సిన కళాశాలలపై అప్పటి ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరిపించినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఆ నివేదిక ఏమైందో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరా తీసి, మళ్లీ విచారణకు ఆదేశించానని తెలిపారు. అప్పట్లో అనుకూలంగా ఉన్న కళాశాలలకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చారనే ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వం మాత్రం ఈ పథకాన్ని కొనసాగిస్తుందని, అక్రమాలకు పాల్పడే కళాశాలలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.5,435 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయని రేవంత్‌రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ బకాయిల్లో రూ.1,410 కోట్లు చెల్లించామని, తమ ప్రభుత్వ బకాయిల్లో రూ.1,465 కోట్లు చెల్లించామని చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలోనే రూ.612 కోట్లు చెల్లించినట్లు వివరించారు. ఏటా ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం సుమారు రూ.2,400 కోట్లు అవసరమవుతాయని తెలిపారు. విద్యార్థుల పేర్లతో మోసపూరితంగా రెండుసార్లు రీయింబర్స్‌మెంట్ పొందే కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యా సంస్కరణల్లో భాగంగా 10,600 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరిగిందని చెప్పారు.
పాలిటెక్నిక్ కళాశాలల ప్రైవేటీకరణకు సంబంధించిన ప్రచారాన్ని సీఎం ఖండించారు. పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేటీకరించడం పచ్చి అబద్ధమని స్పష్టం చేశారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల విధానం విజయవంతం కావడంతో అదే విధానాన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లో అమలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఏటీసీల కోసం 282 ఎకరాల రెవెన్యూ భూమిని బదిలీ చేశామని, ఒక్కో కేంద్రం నిర్మాణానికి సుమారు రూ.46 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి పాలిటెక్నిక్ కళాశాలలు వస్తే సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో మెరుగైన శిక్షణ, మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
పాలిటెక్నిక్ కళాశాలల సిబ్బంది ఉద్యోగ భద్రతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. సిబ్బందిని కొనసాగిస్తామని, విద్యార్థులపై అదనపు ఫీజుల భారం ఉండదని స్పష్టం చేశారు. అవసరమైతే జీవో 97లో సవరణలు చేస్తామని తెలిపారు. విద్యార్థులు, యువత రాజకీయ ప్రయోజనాలకు బలికావద్దని సూచించారు. తమ ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యా సంస్కరణలు పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకున్నవేనని పేర్కొంటూ, 2029 ఎన్నికల్లో ప్రజలు తమ పాలనను నిర్ణయిస్తారని రేవంత్‌రెడ్డి అన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!