

ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ పూర్తయ్యగానే సెప్టెంబర్ చివరలో లేదా అక్టోబరులో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశముందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 15న కూటమి పార్టీల రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జోనల్, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలలో సమన్వయ సమావేశాలు జరపాలని సూచించారు. ఇన్‌ఛార్జులు లేని నియోజకవర్గాలకు త్వరలోనే నియామకాలు చేస్తామని, కొత్త నాయకులు కూటమి శ్రేణులతో కలిసి పని చేయాలని చెప్పారు. వైకాపా దుష్ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు.
రాయలసీమ అభివృద్ధిపై “రాయలసీమ రైజింగ్” పేరుతో ప్రచారం చేయాలని ఆయన ఆదేశించారు. సర్వేల ప్రకారం ప్రభుత్వంపై సానుకూలత ఉన్నప్పటికీ కొందరు ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉందని గుర్తించారు. అందుకే ఎమ్మెల్యేల కోసం ఆగస్టులో రెండు రోజుల వర్క్‌షాప్ నిర్వహిస్తామని తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం, సాగునీటి ప్రాజెక్టుల అమలు, యూరియా సరఫరా యాప్, అన్నదాత సుఖీభవ నిధులు, తల్లికి వందనం వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతిపక్షాల విమర్శలకు ఆధారాలతో సమాధానం ఇవ్వాలని, ఉద్రిక్తతలను పెంచకుండా వ్యవహరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!