విదేశీ శక్తులతో కలిసి కమ్యూనిస్టుల కుట్ర: కిషన్ రెడ్డి
Writer: Harika S 11:45 PM, 13 అక్టోబర్, 2026
దేశంలో అరాచకం సృష్టించేందుకు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలు విదేశీ శక్తులతో కలిసి కుట్ర పన్నుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో నిరసనల పేరుతో ఈ పార్టీలు ఉద్దేశపూర్వకంగా దేశ ఆర్థిక వ్యవస్థను, శాంతిభద్రతలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి... కమ్యూనిస్టుల పాత్రపై ప్రత్యేకంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. "కాంగ్రెస్, కమ్యూనిస్టులు చేస్తున్న ధర్నాల వల్ల ఢిల్లీ మార్కెట్ పూర్తిగా దెబ్బతింది. దసరా, దీపావళి వంటి పండుగ సీజన్‌లో చిన్న దుకాణదారులు సరుకులు తెచ్చుకోలేని దుస్థితిని కల్పించారు. కుట్రపూరితంగా ఢిల్లీ ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తూ వ్యాపారుల పొట్ట కొడుతున్నారు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ తన స్థాయిని మరిచి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
రాహుల్ గాంధీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ప్రజాస్వామ్య హక్కులను దుర్వినియోగం చేస్తూ దేశ ప్రతిష్టను మంటగలుపుతున్నారని విమర్శించారు. ప్రధాని మోడీ, అమిత్ షా, అజిత్ దోవల్‌ను లక్ష్యంగా చేసుకుని బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమకు అనుకూలంగా తీర్పులు రాలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా గద్దె దిగమనడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో తప్పులేదని, కానీ రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేసేలా వ్యవహరించడం దారుణమని ఆయన పేర్కొన్నారు.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!