

ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. విదేశీ దేశాల అధినేతలను ఆలింగనం చేసుకోవడం, వ్యక్తిగత స్నేహాలను ప్రదర్శించడం విదేశాంగ విధానం కాదని, దేశ ప్రయోజనాలను కాపాడటమే నిజమైన దౌత్యమని అన్నారు. ఢిల్లీలో జరిగిన ‘రచనాత్మక్ కాంగ్రెస్’ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తన వాదనను వివరించేందుకు వేదికపై ఉన్న ఆ సంస్థ అధ్యక్షుడు సందీప్ దీక్షిత్‌ను రాహుల్ ఆలింగనం చేసుకున్నారు. అధికారికంగా దేశాధినేతల పర్యటనలను వ్యక్తిగత పర్యటనలతో పోల్చడం సరికాదని పేర్కొన్నారు.
ఇరాన్, అమెరికా, రష్యాలతో భారత్‌కు సంబంధాలు ఉన్నప్పటికీ, ఇరాన్ వివాదంలో మధ్యవర్తిత్వం వహించే అవకాశాన్ని భారత్ కోల్పోయిందని రాహుల్ ఆరోపించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో భారత సైన్యం గస్తీని చైనా అడ్డుకుంటోందని, గల్వాన్ ఘర్షణల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి దేశాన్ని బలహీనపరిచిందని విమర్శించారు. బీజేపీ, ఆరెస్సెస్‌లను ‘జోకర్ల బృందం’గా అభివర్ణిస్తూ, దేశంపై ఏకపక్ష రాజకీయ వ్యవస్థను రుద్దేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పార్లమెంటులో ప్రతిపక్షాల గొంతును ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!