

పశ్చిమ బెంగాల్‌లో జరగనున్న అసెంబ్లీ ఉపఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పేరు, ఎన్నికల గుర్తును రెండు వర్గాలు ఉపయోగించకుండా ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన మధ్యంతర ఆదేశంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా తీర్పును రక్షించడం ఎన్నికల సంఘం బాధ్యత అని పేర్కొన్న ఆయన.. దానికి బదులుగా ప్రజల తీర్పును తారుమారు చేసే శక్తులకు ఈసీ సహకరిస్తోందని ఆరోపించారు. టీఎంసీ అంతర్గత వివాదం నేపథ్యంలో మమతా బెనర్జీ, ప్రత్యర్థి వర్గం రెండింటినీ పార్టీ పేరు, ‘పూలు-గడ్డి’ గుర్తును ఉపయోగించకుండా ఈసీ ఆదేశించింది.
శివసేన, ఎన్సీపీ తర్వాత ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ విషయంలోనూ ఇదే విధానం కొనసాగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒక పార్టీని చీల్చేందుకు బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి పనిచేస్తున్నాయని, ఆ తర్వాత పార్టీ ఎన్నికల గుర్తును లాక్కుంటున్నాయని విమర్శించారు. ఒక పార్టీనే దొంగిలించగలిగితే కోట్లాది మంది భారతీయుల ఓట్ల విషయంలోనూ అదే జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు ప్రజాస్వామ్య పతనానికి చిహ్నాలని పేర్కొంటూ, పార్టీని కాపాడుకునే పోరాటం కేవలం మమతా బెనర్జీది మాత్రమే కాదని, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలను కోరుకునే ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి ఓటరుదని రాహుల్ గాంధీ అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!