

రష్యా, ఇరాన్‌పై అమెరికా తీసుకురానున్న కొత్త ఆంక్షల చట్టంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించిన ‘లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026’ చట్టరూపం దాల్చితే, రష్యా నుంచి చమురు, సహజ వాయువు కొనుగోలు చేసే కొన్ని దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారం పొందుతారు. భారత్, చైనా వంటి రష్యా ఇంధనాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే దేశాలు ఈ నిబంధనల పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ బిల్లు భారత్‌పై 100 శాతం సుంకాన్ని ఆటోమేటిక్‌గా విధించదు; అలాంటి సుంకాలను విధించే అధికారాన్ని అధ్యక్షుడికి కల్పిస్తుంది.
ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ, అమెరికా కాంగ్రెస్‌లో బిల్లు ఆమోదం పొందిన విషయాన్ని గమనించామని, తదుపరి పరిణామాలను పరిశీలిస్తున్నామని తెలిపింది. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు ఇంధన భద్రత కల్పించడం భారత్‌కు అత్యంత ముఖ్యమని, అందుకోసం వివిధ దేశాల నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేస్తూ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ అంశంపై అమెరికా అధికారులతో ఉన్నత స్థాయిలో చర్చలు జరిగినట్లు పేర్కొంటూ, ఈ చట్టం భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలతో పాటు అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని భారత్ ఇప్పటికే అమెరికా ప్రతినిధులకు వివరించినట్లు తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!