

ప్రతిపక్షం చేస్తున్న కుట్రలు, దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టామని, ప్రభుత్వం వెయ్యి రోజుల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇదే ఒరవడిని కొనసాగించాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలు ప్రజలకు చేరకుండా, వారిని తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తుంటాయని.. అప్రమత్తంగా ఉంటూ వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. అసెంబ్లీలో జరిగిన ఘటనలపై ఫ్లాష్ సర్వే నిర్వహించగా బీఆర్‌ఎస్ తీరును ప్రజలు తప్పుపడుతున్నారని, కాంగ్రెస్‌పై సానుకూల అభిప్రాయం ఉందని సీఎం తెలిపారు. 22ఏ జాబితాలో కోటి ఎకరాలు ఉన్నాయంటూ బీఆర్‌ఎస్ చేస్తున్న ప్రచారం అవాస్తవమని, వాస్తవానికి 3.06 లక్షల ఎకరాలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పేరుతో ఓట్ల తొలగింపు జరుగుతోందని ఆరోపిస్తూ, ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
బీఆర్‌ఎస్ నేతలు అధికారుల పట్ల అనుచితంగా వ్యవహరించారని, మహిళా అధికారులను ఇబ్బంది పెట్టారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. శాసనసభాపతిని దూషించడం, దళితులను అవమానించడం వంటి ఘటనలపై విచారణ కొనసాగుతోందన్నారు. సభా సమావేశాలకు ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరై తమ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించాలని సూచించారు. తెలంగాణ నమూనాను దేశానికి ఆదర్శంగా తీసుకుని కులగణన చేపట్టేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా ఐక్యంగా పనిచేస్తే ప్రతిపక్షాల కుట్రలను ఎదుర్కోవచ్చన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, విద్య, వైద్య కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ఆందోళన వ్యక్తం చేయగా, మంత్రి వివేక్ పాలిటెక్నిక్ విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!