

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విజయవాడలో నిర్వహించిన జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు కీలక దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని, ప్రజాప్రతినిధులందరూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వెంటనే పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రజలు పార్టీపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
పార్టీ శ్రేణులు, వీర మహిళలు, జనసైనికులతో మరింత మమేకం కావాలని, వారి సమస్యలను తెలుసుకుని భరోసా కల్పించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే కార్యక్రమాల షెడ్యూల్‌ను తప్పనిసరిగా అమలు చేయడంతో పాటు, క్షేత్ర స్థాయి నుంచి ప్రజలు మరియు పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను నిరంతరం నాయకత్వానికి చేరవేయాలని సూచించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులుగా పనిచేసిన ప్రజాప్రతినిధులు తమ అనుభవాలను పంచుకోగా, వారికి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. సమావేశంలో పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి కందుల దుర్గేష్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!