

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్ హోటల్‌లో జరిగిన బీజేపీ మేధావుల సమావేశంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు, మేధావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్‌కు ఏటీఎంగా మారిందని, ప్రస్తుతం కాంగ్రెస్‌కు రేవంత్ సర్కార్ ఏటీఎంగా మారిందని ఆరోపించారు. తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం “సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్” సూత్రంతో పనిచేస్తోందని జేపీ నడ్డా తెలిపారు. దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఆహార భద్రత, తెలంగాణలో కోటి 20 లక్షల మందికి గరీబ్ కల్యాణ్ యోజన ప్రయోజనాలు అందుతున్నాయని చెప్పారు. డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష నగదు బదిలీ, ఆయుష్మాన్ భారత్, స్వచ్ఛ భారత్, జాతీయ రహదారులు, రైల్వేలు, సెమీకండక్టర్, కృత్రిమ మేధస్సు వంటి రంగాల్లో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం భారీ నిధులు అందిస్తోందని, సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!