

మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుకు బీజేపీ ఏమాత్రం వ్యతిరేకం కాదని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టం చేశారు. అయితే, గాంధీ సరోవర్ పేరుతో మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న పేద కుటుంబాలను నిర్వాసితులను చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మూసీ ప్రాజెక్టును బీజేపీ అడ్డుకుంటోందంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. పేదల ఇళ్లకు ఎలాంటి నష్టం కలగకుండా మూసీ నదిని ప్రక్షాళన చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు, పీఆర్‌సీ అమలుకు నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం.. మూసీ ప్రక్షాళన కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధపడటం విడ్డూరంగా ఉందని రాంచందర్ రావు ప్రశ్నించారు. మరోవైపు, ఢిల్లీలో ప్రతిపక్షాలు నిర్వహించనున్న మాక్ పార్లమెంట్‌పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో మాక్ పార్లమెంట్ నిర్వహణను కాంగ్రెస్ నేతలు ప్రశ్నించిన విషయాన్ని గుర్తుచేశారు. పార్లమెంట్‌ను ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణించిన కాంగ్రెస్ నాయకులే ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం మాక్ పార్లమెంట్ నిర్వహిస్తూ పార్లమెంటరీ వ్యవస్థను అవమానిస్తున్నారని ఆరోపించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!